2024 జనవరి 1 నాటికి అయోధ్యలో శ్రీరామ మందిరం సిద్ధం - త్రిపుర సభలో ప్రకటించిన అమిత్ షా


Tripura :
జనవరి 1, 2024 నాటికి అయోధ్యలో రామమందిరాన్ని సిద్ధం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ప్రకటించారు.

ఈ ఏడాది మార్చిలో త్రిపుర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సబ్రూమ్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని అమిత్ షా మొదటిసారి శ్రీరామ మందిరం గురించి బహిరంగంగా ప్రకటించారు.

బహిరంగ ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్, కమ్యూనిస్టులు రామమందిర అంశాన్ని చాలా కాలంగా కోర్టు పరిధిలో ఉంచారని, అయితే నిర్మాణానికి అనుమతినిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమిపూజ చేసి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారని అన్నారు.

"2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో నేను బీజేపీ అధ్యక్షుడిగా, రాహుల్‌ బాబా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్నాము. అయితే అయోధ్యలో ఆలయ నిర్మాణ తేదీ బీజేపీ ఎప్పటికీ చెప్పదని అతను ప్రతిరోజూ అనేవాడు. కాబట్టి రాహుల్ బాబా చెవులు తెరుచుకొని వినండి, జనవరి 1, 2024న మీరు అయోధ్యలో సిద్దమైన గొప్ప శ్రీరామ మందిరాన్ని చూస్తారు." అని అమిత్ షా తెలిపారు. 

రామమందిర్ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్, రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఈ వారం ప్రారంభంలో భారత్ జోడో యాత్ర చేస్తోన్న రాహుల్ గాంధీని అభినందిస్తూ వేర్వేరు ప్రకటనలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

దశాబ్దాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదు కూల్చివేసిన అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో శ్రీరామ మందిర నిర్మాణానికి నవంబర్ 9, 2019న సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. 2020 ఆగస్టు 5న ఆలయ నిర్మాణానికి ప్రధాని 'భూమి పూజ' చేసిన విషయం తెలిసిందే. 

0/Post a Comment/Comments