జాతీయ పార్టీగా మారనున్న AAP ; వచ్చేసారి గుజరాత్ కోటను జయిస్తానంటున్న కేజ్రీవాల్

aam aadmi party natioal status arvind kejriwal politics meter

Delhi :
ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఏర్పడిన పదేళ్ల తర్వాత జాతీయ పార్టీ హోదాను పొందేందుకు సిద్ధమైంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 13% ఓట్లు, ఐదు సీట్లు సాధించింది ఆప్. పార్టీ జాతీయ హోదాను సాధించడంలో సహకరించినందుకు గుజరాత్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆప్ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, “మేము ఈసారి కోటను బద్దలు కొట్టగలిగాము, వచ్చేసారి దాన్ని గెలుచుకుంటాము” అని అన్నారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, AAP తన ఎన్నికల అదృష్టాన్ని గుజరాత్‌లో సూరత్ మునిసిపల్ ఎన్నికల్లో పరీక్షించింది, అక్కడ 28% శాతం ఓట్లను సాధించి రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది.

వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న చాలా రాష్ట్రాల్లో పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ యోచిస్తోంది. వాటిలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, బిజెపి అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి.

ఎన్నికల సంఘం (ఈసీ) నిబంధనల ప్రకారం నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందితే ఆ పార్టీకి జాతీయ హోదా లభిస్తుంది. రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే, పార్టీ అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 6% ఓట్లను, రెండు సీట్లు సాధించాలి.

ఆప్ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందిన నాల్గవ రాష్ట్రం గుజరాత్. ఢిల్లీ, పంజాబ్‌లలో ఆ పార్టీకి ప్రభుత్వాలు ఉండగా, గోవాలో రెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని 6.67% ఓట్లను సాధించింది.

ప్రస్తుతం దేశంలో ఏడు జాతీయ పార్టీలు ఉన్నాయి. (బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఐ(ఎం), నేషనల్ పీపుల్స్ పార్టీ)

0/Post a Comment/Comments